KAMATH@COFFE

counter

Search google

Sunday, March 13, 2022

స్వామి పరమాచార్య

మార్గం చూపిన మహాస్వామి

ఒక మతం యొక్క శక్తి అందులో ఉన్న మహాపురుషుల వల్లనే కాని దాన్ని ఆచరించే వారి సంఖ్య వల్ల కాదు. అటువంటి మన ధర్మం ఎందఱో యోగులు, సిద్ధులు, సన్యాసులు, సాధువులను పొందుతూనే ఉంది. మనల్ని భగవంతుని వైపుపు నడిపించడానికి వచ్చిన మన పరమాచార్య స్వామివారు ఆదిశంకర పరంపరలో వచ్చిన మహాత్ములు. మన ధర్మాన్ని, సనాతాన సంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలను పునరుద్ధరించి యావత్ ప్రపంచం మనవైపు తిరిగిచూసేలా చేశారు. నాకు వారితో ఉన్న అనుభవాలను కొన్ని పంచుకుంటాను.

నాకు చాలా తీవ్రమైన పరిస్థితులు కలిగాయి మా సాల్వెంట్ ఎక్సట్రాక్షన్ ప్లాంట్ - ఎల్ వి ఆర్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రై. లిమిటెడ్., ఉప్పల్, హైదరాబాద్ లో. 1979లో పరమాచార్య స్వామివారు షోలాపూర్ లో మకాం చేస్తున్నారు. నా సమస్యలను చెప్పుకోవడానికి నేను అక్కడకు వెళ్లాను. అప్పుడు స్వామివారు అక్కడి ఒక గోడలో ఉన్న వినాయకుని పోలిన విగ్రహంతో విఘ్నేశ్వర ఆలయం కట్టించమని ఆదేశించారు. వారి ఆజ్ఞ ప్రకారం సృష్టి గణపతి అనే పేరుతో వినాయకుని మందిరం కట్టించాను. ఆలయ ప్రతిష్టకు పండితులను స్వామివారే పంపారు. ఆరోజు విష్ణువు యొక్క వాహనమైన గరుడపక్షి ఒకటి దేవాలయ గోపురం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మాకు శుభం కలుగజేసింది. మా సంస్థకు సంబంధించిన సమస్యలు అంతటితో సమసిపోయాయి.

1930లలో తిరుమల వెళ్లి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా కష్టతరమైన విషయం. దేవాలయం చేరుకోవడానికి దుర్గమమైన ఆ కొండను ఎక్కి ఎంతో వ్యయప్రయాసలకోర్చి గంటల తరబడి శ్రమ పడాల్సి వచ్చేది. అప్పట్లో సత్రాలు, మెట్లు మొదలైన వసతులు ఉండేవి కావు. ఉదయం పదకొండు నుండి సాయింత్రం ఐదు గంటల వరకే స్వామి దర్శనం. భక్తులందరూ ఎండు పులల్లతో చెట్ల క్రింద వండుకుని తినడమే. అప్పుడే నాకు ఉచితంగా అన్నదానం ఎందుకు చెయ్యకూడదనే ఆలోచన వచ్చింది. పెద్దయ్యాక మరలా ఆ ఆలోచన కలిగి ఈ పథకం ఆలోచన మహాస్వామివారి ముందుంచితే, సరే అని వారి అంగీకారం తెలిపారు.

పరమాచార్య స్వామి ఆశీస్సులతో ఆప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావు గారిని కలిశాను. శ్రీవారి ఆశీస్సులు పొందిన ఈ పథకం వారికి నచ్చింది. స్వామివారి అనుగ్రహంతో వెంటనే తిరుమల కొండపై ఈ పథకం ఆట్టహాసంగా మొదలుపెట్టబడింది.

1985 మే లో ప్రారంభోత్సవం రోజు శ్రీ ఎన్.టి. రామారావు గారు ఈ పథకం వెనుక ఉన్న నా కష్టాన్ని శ్రమని అభినందించి, ఇది ఇంకా అభివృద్ధి చెందాలని కాంక్షించారు. ఇప్పుడు రోజూ ఇరవైఐదు వేలమందికి ఉచితంగా అన్నప్రసాదాన్ని పెడుతూ ఇంకా ఎన్నోచోట్ల ఇటువంటి పథకం మొదలుపెట్టడానికి స్ఫూర్తినందించింది.

తరువాత నా భార్యకు కంటి సమస్య ఒకటి ఇబ్బంది పెట్టసాగింది. తను మాత్రం ప్రఖ్యాత కంటివైద్యులు డా. యస్.యస్. బద్రినాథ్ వద్దనే శస్త్రచికిత్స చేయించుకుంటానని పట్టుబట్టింది. తను, నేను కంచి మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళాము. స్వామివారు మా ఇద్దరినీ లోపలకు తీసుకునివెళ్ళి నాకు పంచె, మా ఆవిడకు చీర, జాకెట్టు ముక్క అనుగ్రహించారు. ఈ చిన్న ఆపరేషన చెయ్యడానికి విముఖత చూపించ డాక్టరుగారు మరుసటిరోజే నాకు ఫోను చేసి తమ అంగీకారం తెలిపారు. ఆ శస్త్రచికిత్స విజయవంతమై ఈనాటికి తను ఆరోగ్యంగా ఉంది. మహాస్వామివారి అనుగ్రహం మాకు సంతోషాన్ని కలుగజేసింది.

1979లో నేను నా భార్య, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ చల్ల కొండయ్య, వారి భార్యతో కలిసి మహాస్వామి వారి దర్శనానికి షోలాపూర్ వెళ్లి ఆశీస్సులు అందుకున్నాము. అప్పుడు ఆశ్రమ సేవకులొకరు వచ్చి, ఆశ్రమం ఆవు పురిటినొప్పులతో బాధపడుతోందని తెలిపారు. పరిస్థితి తెలిసిన మహాస్వామివారు వెంటనే లోపలి వెళ్ళారు. ఇరవై నిముషాలైనా వారు బయటకు రాకపోవడంతో, మేమందరమూ లోపలికి వెళ్లి చూస్తే మహాస్వామివారు ధ్యానంలో ఉన్నారు. కొద్దిసేపటి తరువాత ఆ ఆవు ఏ ఇబ్బంది లేకుండా ఒక దూడకు జన్మనిచ్చింది.

29-9-1996న అసోసియేషన్ ఫర్ హిందూ ధర్మ వారి ఆధ్వర్యంలో జరిగిన కంచి కామకోటి పీఠం శంకరాచార్యుల 103వ జయంతి కి హాజరయ్యాను. అక్కడ అంతమంది పరమాచార్య స్వామివారి భక్తులు చెప్పిన అనుభవాలను విని, నా మనస్సంతా వారి అపార కరుణ గురించిన ఆలోచనలే ఉండిపోయాయి.

అదే మనస్సుతో ఆరోజు రాత్రి విశ్రమించాను. ఆ రాత్రి నాకు అత్యద్భుతమైన ఒక కల వచ్చింది. అందులో జగద్రక్షకుడైన శ్రీమహావిష్ణువు పరమాచార్య స్వామివారితో మాట్లాడుతున్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను. భక్తులకు ఉచితంగా అన్నం పెట్టాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవం పోసిన తిరుపతిలోని అన్నదాన పథకాన్ని ప్రారంభింపజేసి, రోజూ ఇరవైవేల మందికి ఉచితంగా అన్నం పెట్టడానికి కారణం ఇతడేనా అని అడిగారు. అందుకు మహాస్వామివారు ఇతనే ఆ పథకం రూపకర్త అని, ఇంకా విద్యా ధర్మ (ఉచిత విద్య), వైద్య దానం (ఉచిత వైద్యం), కన్యా దానం (ఉచిత కల్యాణం) వంటి పథకాలలో కీలక వ్యక్తీ అని చెప్పారు. అందుకే ఇతనికి వైకుంఠంలో ఉండగలిగి, ఈ సమావేశాన్ని చూడగలిగాడు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు.

Followers